ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. భారీగా ప్రాణనష్టం

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో.. సుమారు 25-30 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం ఉత్తరాఖండ్ లో జరిగింది.

Update: 2024-10-05 07:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తోన్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడటంతో.. సుమారు 25 నుంచి 30 మంది వరకూ మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగగా.. ఆ సమయంలో బస్సులో 50-55 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ పట్టు కోల్పోవడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతం.. వధువు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వా్ర్ జిల్లాలోని లాల్ ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖల్ కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. స్థానిక ఎమ్మెల్యే రీతూ ఖండూరి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

ఉత్తరాఖండ్ లో రోడ్డు మార్గాలు ప్రమాదకరంగా ఉంటాయి. వాహనంపై పట్టుకోల్పోతే.. డైరెక్ట్ గా లోయలోకి పడిపోతాయి. అందుకే ఇక్కడ రోడ్డుప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి గంగోత్రి నేషనల్ హైవేపై ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి వాగులో పడటంతో ముగ్గురు మరణించగా.. మరో 24 మంది గాయపడ్డారు. 


Similar News