Kolkata Rape Case: డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతాం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి నిరసనగా గత కొద్దిరోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.

Update: 2024-10-05 10:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి నిరసనగా గత కొద్దిరోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. అయితే, వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 24 గంటలు గడువు ఇచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్‌ను తొలగించాలని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం, జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే 24 గంటల్లోగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అలానే డాక్టర్ల నిరసన ప్రదర్శనలో ఉద్రిక్తత నెలకొంది. వేదికపై బారికేడ్లు వేసి ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు.

నిరవధిక నిరాహార దీక్ష

24 గంటల్లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని దీదీ సర్కారుని హెచ్చరించారు. ఇందులో భాగంగా కొందరు ఇక్కడే ఉంటామని చెప్పారు. దుర్గాపూజ పండుగ సందర్భంగా కూడా ధర్మతల మెట్రో ఛానల్ ప్రాంతంలో వైద్యులు నిరసనను కొనసాగిస్తున్నారు. భద్రత సహా తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేవరకు నిరసనను విరమించబోమని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకునే వరకు నిరసన విరమించేది లేదని నొక్కి చెప్పారు. ఇకపోతే, బుధవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్‌లు టార్చ్‌లైట్ ఊరేగింపు నిర్వహించారు.


Similar News