Bengal: బెంగాల్ లో మరో దారుణం.. పదకొండేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం మరువకముందే మరో ఘోరం జరిగింది. శుక్రవారం కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

Update: 2024-10-05 10:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం మరువకముందే మరో ఘోరం జరిగింది. శుక్రవారం కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటినుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులకు ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిర్జన ప్రదేశంలో ఆమె డెడ్ బాడీ దొరికింది. బాలిక శరీరమంతా గాయాలు ఉండటంతో, కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసుల అదుపులో అనుమానితుడు

ఇకపోతే, ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్‌ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు. ఇకపోతే, బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ పేర్కొన్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న నిందితులపై చర్యలు తీసుకోవట్లేదని బెంగాల్‌ ప్రభుత్వంపై వండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.


Similar News