మణిపూర్‌లో మళ్లీ హింస: ఇద్దరు మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, జో తెగలు అధికంగా ఉండే చురచంద్‌పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి వందలాది మంది పోలీస్ సూపరిండెంట్ (ఎస్పీ) కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, జో తెగలు అధికంగా ఉండే చురచంద్‌పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి వందలాది మంది పోలీస్ సూపరిండెంట్ (ఎస్పీ) కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు మృతి చెందగా..25మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 14న చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్ రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్న సాయుధ వ్యక్తులతో సెల్పీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జిల్లా ఎస్పీ శివానంద్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌తో సుమారు 400 మందితో కూడిన సాయుధ గుంపు ఎస్పీ కార్యాలయంపై దాడికి పాల్పడింది. ఆఫీస్‌లోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేశారు. అంతేగాక రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఆందోళన కారులపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇద్దరు మరణించగా..25 మందికి పైగా గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. కాగా, చురచంద్‌పూర్ కుకీ-జో తెగల ఆధిపత్యం ఉన్న జిల్లా. గతేడాది ప్రారంభమైన జాతి ఘర్షణల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం ఇదే కావడం గమనార్హం.
200 మందికి పైగా మృతి!
మణిపూర్‌లో కుకీ-జో తెగలు, మైతీల మధ్య గతేడాది మే నుంచి ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొమ్మది నెలలుగా సాగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించగా..1100 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. సుమారు 65వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనల్లో మొత్తంగా పోలీసులు 6వేల కేసులు నమోదు చేసి..144 మందిని అరెస్టు చేశారు. మరోవైపు చురచంద్ పూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటనకు ఎస్పీ శివానంద్ బాధ్యత వహించాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఎస్పీ తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉండనివ్వం. వెంటనే హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలి. లేకపోతే ఆందోళనలు మరింత పెంచుతాం’ అని హెచ్చరించింది.