రాహుల్ గాంధీ ఎంపీ సీటు ఖాళీ.. ఉప ఎన్నికలెప్పుడు?
సూరత్ కోర్టు తీర్పుతో రాహుల్‌గాంధీని అనర్హుడిగా ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడు స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: సూరత్ కోర్టు తీర్పుతో రాహుల్‌గాంధీని అనర్హుడిగా ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడు స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నది. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయడంతోనే ఆ స్థానం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించేవారు లేనట్లయింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సెక్రటేరియట్ వయనాడు ఎంపీ సీటు ఖాళీగా ఉన్నట్లు స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఎంపీలు లేకుండా ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటికీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కేంధ్ర ఎన్నికల సంఘంపై పడింది. పంజాబ్‌లోని జలంధర్ (ఎస్సీ), లక్షద్వీప్ (ఎస్టీ) స్థానాలతో పాటు వయనాడుకు కొత్తగా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోడానికి ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అనే ఆసక్తి నెలకొన్నది.
వయనాడు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం లాంఛనంగా నిర్ణయం తీసుకుంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఈ మూడు లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నది.