యుద్ధాన్ని ముగించమని పుతిన్ కు చెప్పండి.. భారత్ కు అమెరికా వినతి

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత్ కృషి చేయాలని అమెరికా కోరింది.

Update: 2024-07-16 05:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత్ కృషి చేయాలని అమెరికా కోరింది. రష్యాతో ఉన్న సుదీర్ఘకాల బంధాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాలని అంది. కైవ్ పై జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని కోరింది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియా సమావేశంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. అందులోభాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. వాటిని ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రష్యాతో ఉన్న బంధం, భారత్ కు ఉన్న విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని పుతిన్ తో మాట్లాడాలని కోరారు. ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించాలని పుతిన్ కు చెప్పాలని హితవు పలికారు. యూఎన్ నిబంధనలు పాటించి ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించమని చెప్పారు. భారత్‌తో తమకూ సత్సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు.

మోడీ రష్యా పర్యటన గురించి..

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే రష్యాలో పర్యటించారు. ద్వైపాక్షిక అంశాలపై ఆయన పుతిన్‌తో చర్చలు జరిపారు. పలు రంగాల్లో సహకారానికి ఒప్పందానికి అంగీకారం తెలిపారు. 2030 నాటికి రెండు దేశాల మధ్య 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించారు. మరోవైపు మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్‌ అందజేశారు. అయితే, శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వల్ల పరిష్కారం లేదని.. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టంచేశారు. భవిష్యత్ తరాల కోసం శాంతి అత్యం ముఖ్యమని అన్నారు. చర్చల ద్వారానే శాంతి సాధ్యమవుతుందన్నారు. మరోవైపు మోడీ పర్యటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసహనం వ్యక్తం చేశారు. శాంతి నెలకొల్పకుండా చూడటమే మోడీ ఉద్దేశం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Similar News