UPSC: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ పై కేసు నమోదు

ట్రైనీ ఐఏఎస్(Trainee IAS) అధికారి పూజా ఖేడ్ కర్ పై కేసు నమోదైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Update: 2024-07-19 10:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ ఐఏఎస్(Trainee IAS) అధికారి పూజా ఖేడ్ కర్ పై కేసు నమోదైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పూజాపై విచారణ జరుగుతోంది. కాగా.. పూజాపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆమెపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యకు సిద్ధమైంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా కూడా ఆమెను డిబార్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేడ్ కర్ కు జారీ చేసింది. బాధ్యతలను నెరవేర్చడంలో యూపీఎస్సీ రాజ్యాంగ ఆదేశాలకు కట్టుబడి ఉందని పేర్కొంది. అన్ని పరీక్షలతో సహా దానికి సంబంధించన అన్ని ప్రక్రియలను ఎటువంటి రాజీ లేకుండా సాధ్యమైనంత ఎక్కువ శ్రద్ధతో నిర్వహిస్తుందని స్పష్టం చేసింది.

నకిలీ ధ్రువపత్రాలు

కాగా, ట్రైనీ ఐఏఎస్‌ అధికారి పూజా మనోరమ దిలీప్ ఖేడ్ కర్ దుష్ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణలపై వివరణాత్మక, సమగ్ర దర్యాప్తు నిర్వహించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, ఫొటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు.. ఇలా అన్నింటినీ మోసపూరితంగా పొందినట్లు విచారణలో గుర్తించింది. పూజాపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. రాజ్యాంగ నిబద్ధత, విశ్వాసం, విశ్వసనీయతకు నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్లు వివరించింది. పరీక్షా ప్రక్రియల పవిత్రత, సమగ్రతను అత్యంత న్యాయంగా, నిబంధనలు కచ్చితంగా పాటించేలా నిర్ధారిస్తామని యూపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.



Similar News