శశి థరూర్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరువు నష్టం దావా

ఓటర్లకు, పారిష్ ప్రీస్ట్‌లకు లంచం ఇచ్చినట్టుగా తనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు

Update: 2024-04-10 08:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఓ టీవీ ఛానెల్‌లో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు కేంద్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు పంపారు. ఓటర్లకు, పారిష్ ప్రీస్ట్‌లకు లంచం ఇచ్చినట్టుగా తనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. శశిథరూర్ ప్రకటనలు తన పరువు, ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసినవని, ఆయన వ్యాఖ్యల కారణంగా తిరవనంతపురంలోని మొత్తం క్రైస్తవ సమాజం ఓటు కోసం డబ్బు తీసుకుంటున్నారనేలా అగౌరవపరిచారని నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినట్టేనని తెలిపారు. దీనివల్ల తన ఎన్నికల ప్రచారంపై ప్రభావం పడుతుందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శశిథరూర్ ప్రయోజనం పొందడానికే ఈ విధమైన ప్రవర్తనను అవలంబిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, శశిథరూర్, రాజీవ్ చంద్రశేఖర్ ఏప్రిల్ 26న జరగనున్న తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News