రష్యాలో ఘోర రైలు ప్రమాదం

రైలులోని 14 బోగీలలో తొమ్మిది ట్రాక్‌ పట్టాలు తప్పాయి.

Update: 2024-06-27 15:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో బుధవారం(జూన్‌ 26) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఉత్తర కోమి రిపబ్లిక్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు రష్యా రైల్వే తెలిపింది. ఈ రైలు 215 మందితో ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న వోర్కుటా నగరం నుంచి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా పట్టాలు తప్పింది. దాదాపు 5,000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలు గమ్యం చేరుకునేందుకు ఐదు రోజులు పడుతుంది. రైలులోని 14 బోగీలలో తొమ్మిది ట్రాక్‌ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఒక ప్రయాణికుడి గురించి ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు రెండు సహాయక రైళ్లతో పాటు రక్షణ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు. ప్రమాదం అడవి ప్రాంతంలో జరగడంతో క్షతగాత్రులను తరలించేందుకు కష్టంగా మారింది. అదే మార్గంలో వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతానికి ప్రమాదం జరిగినదానికి కారణాలు తెలియరాలేదు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తప్పి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరణించిన వారి బంధువులు, గాయపడిన ప్రయాణీకులకు 5,700-45,500 డాలర్ల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 


Similar News