Donald Trump: అధికారంలోకి వస్తే ఆర్థిక అద్భుతాలు చేస్తా- ట్రంప్

అధికారంలోకి వస్తే ఆర్థిక అద్భుతాలు చేసి చూపిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) అన్నారు. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

Update: 2024-11-02 08:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అధికారంలోకి వస్తే ఆర్థిక అద్భుతాలు చేసి చూపిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) అన్నారు. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌(Kamala Harris) పై విమర్శలు గుప్పించారు. ఆర్థిక విధానాల్లో ఆమె పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. బెడైన్ ప్రభుత్వం ఆర్థిక అజెండా కారణంగా ఇటీవలే ప్రైవేటురంగంలో 30 వేల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. తయారీ రంగంలోనూ దాదాపు 50వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొన్నారు. హ్యారిస్ అధికారంలోకి వస్తే ఆర్థికవ్యవస్థ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

అమెరికన్ కార్మికులు

కమలా హ్యారిస్‌ విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఆ విధానాల వల్ల అమెరికన్‌ కార్మికులు నష్టపోతున్నారని మండిపడ్డారు. కమలా హ్యారిస్ ఒక రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్ట్ అని విరుచుకుపడ్డారు. గన్ కల్చర్ తుడిచిపెడతానని కమలా ప్రామిస్ చేసిందన్నారు. కానీ తాను మాత్రం దేశంలోని ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. హింస, నేరాలు జరగకుండా అణచివేస్తానని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానని తెలిపారు. దేశ సమస్యలే కాకుండా ప్రపంచ దేశాల పరిస్థితులను నిరంతరం గమనిస్తుంటానని డొనాల్డ్‌ ట్రంప్ అన్నారు. అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, ఆధునికీకరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ అన్నారు.


Similar News