Tripura floods: త్రిపురలో భారీ వర్షాలు.. రాష్ట్రం మొత్తం విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటన

త్రిపురలో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం కొనసాగుతోంది. భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-29 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురలో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం కొనసాగుతోంది. భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్రాన్ని ప్రకృతి ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రూ.15,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

దీంతో త్రిపుర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (టీడీఎంఏ), రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతంగా ప్రకటించినట్టు గురువారం తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేయడానికి కేంద్రం ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్ మంత్రిత్వ శాఖ బృందాన్ని పంపింది. ప్రస్తుతం 369 సహాయ శిబిరాల్లో 53,356 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. వారి ఇళ్లను పునర్నిర్మించడానికి ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించింది. 


Similar News