ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర.. నిఘావర్గాల హెచ్చరిక
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతోందని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రకు ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దసరా, దీపావళి పండుగల వేళ రాజధానిలో ఉగ్రదాడికి కుట్రలు చేశారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ దాడులకు ఉగ్రవాదులు విదేశీ పౌరుల్ని కవచంగా ఉపయోగించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్.. అన్ని ప్రాంతాల్లోనూ వాహనాల తనిఖీలను పెంచాలని పోలీసులను ఆదేశించారు. దాడులకు ముందు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉగ్రవాద ముఠాలు ప్లాన్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో అలాంటి పోస్టులపై నిఘా పెట్టాలని సూచించాయి.