Karnataka:ఇజ్రాయెల్ కాదు.. ఇకపై జెరూసలేం ట్రావెల్స్

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇకపోతే, ఆ యుద్ధం ఎఫెక్ట్ ఇతర దేశాలపైనా ఉంది.

Update: 2024-10-07 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇకపోతే, ఆ యుద్ధం ఎఫెక్ట్ ఇతర దేశాలపైనా ఉంది. ఇటీవలే కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఇలాంటి ఘటన జరిగింది. కర్ణాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్‌ బస్సును లెస్టర్ కటీల్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఆ ట్రావెల్స్ పేరుని మార్చాలని సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆయనపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్ ట్రావెల్స్ ని జెరూసలేంగా ఆయన మార్చారు.

12 ఏళ్ల పాటుగా ఇజ్రాయెల్ లో..

ఇకపోతే, బస్సు ఓనర్ లెస్టర్ కటీల్ మాట్లాడుతూ 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టానని అన్నాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోందన్నారు. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్‌ పేరు ఎందుకు పెట్టారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, చేసేది లేక బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు.


Similar News