అర్ధరాత్రి పూజా ఖేడ్ కర్ ఇంటికి పోలీసులు..!

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్ కర్ విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె నివాసానికి వాషిమ్ పోలీసులు వెళ్లినట్లు సమాచారం.

Update: 2024-07-16 09:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్ కర్ విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె నివాసానికి వాషిమ్ పోలీసులు వెళ్లినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు పూజతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళా పోలీసుల బృందం పుణేలోని పూజా నివాసానికి వెళ్లింది. దాదాపు రెండు గంటల తర్వాత మహిళా పోలీసులు అక్కడ్నుంచి వెళ్లినట్లు సమాచారం. కొన్ని కీలక విషయాలు పంచుకోవడానికి తమ వద్ద సమాచారం ఉందని పేర్కొంటూ సమావేశాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులతో పూజా ఏం మాట్లాడిందనేది తెలియరాలేదు.అయితే, పోలీసులను ఇంటికి రమ్మని ఆమెనే అభ్యర్థించారట. కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడిస్తానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్..

పుజా ఖేడ్ కర్ పై పదవి దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆమె నకిలీ ధ్రువీకరమ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్ లో చేరినట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఇప్పుడు మరో విషయం బయటకొచ్చింది. సివిల్స్ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు తెలుస్తోంది. 2019లో పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్‌ రాయగా.. 2022లో పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్ కర్ పేరుతో హాజరయ్యారట. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అటు సెంట్రల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును కూడా వేర్వేరుగా పేర్కొనడం గమనార్హం. కాగా.. పూజాపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆమె దోషిగా తేలితే ఆమెకు పదవి ఊడటంఖాయం. కాగా.. నేరం రుజువయ్యే వరకు అందరూ నిర్దోషులేనని పూజా సోమవారం మీడియా ముందు స్పందించారు.


Similar News