Tamilnadu: తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకున్నారు.

Update: 2024-09-29 11:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం చెన్నైలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుకను నిర్వహించారు. డా. గోవి. చెజియాన్, ఆర్.రాజేంద్రన్, ఎస్ఎం నాసర్‌లను కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వీరితో పాటు మనీలాండరింగ్ కేసులో 15 నెలల పాటు జైలు జీవితం గడిపిన డీఎంకే నేత సెంథిల్ బాలాజీని తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. ఆయనకు పాత శాఖలు.. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు.

సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్, టెక్నాలజీతో సహా ఉన్నత విద్యను గోవి చెజియాన్ చూసుకుంటారు. పర్యాటక శాఖ, షుగర్, చెరకు ఎక్సైజ్, చెరకు అభివృద్ధి శాఖలకు మంత్రిగా ఆర్.రాజేంద్రన్ ఉంటారు. ఎస్ఎం నాసర్‌‌కు మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమం, శరణార్థులు, తరలింపులు, వక్ఫ్ బోర్డు శాఖలను కేటాయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన నలుగురు మంత్రులకు స్టాలిన్ అభినందనలు తెలిపారు.


Similar News