ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లనున్న ఢిల్లీ.. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ..!
ప్రతిపక్షాల ఆందోళనతో ఇవాళ (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లనుంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాల ఆందోళనతో ఇవాళ (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లనుంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మాత్రమే నిధులు కేటాయించి.. మిగిలిన రాష్ట్రాలకు మొండిచేయి చూపారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సమర్పించిన బడ్జెట్‌లో బీజేపీయేతర రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా రూపొందించారని.. మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తామని ఇండియా కూటమి పిలుపునిచ్చింది.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ధర్నా:
వైపీసీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏపీలో జరిగిన దాడుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శించనున్నారు. కాగా, ఇటీవల పల్నాడు జిల్లాలోని వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపడతామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) జగన్ రాజధానిలో ఆందోళన చేపట్టనున్నారు. ఏకంగా ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతుండటంతో పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ధర్నాకు దిగుతుండటంతో పోలీసులు పర్మిషన్ ఇస్తారా..? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.
8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన:
తెలంగాణకు చెందిన ఎనిమిది మంది అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని.. నిధుల కేటాయింపులో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించినందుకు నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కక్ష కట్టారనే అభిప్రాయంతో పార్లమెంటు వేదికగానే నిరసన వ్యక్తం చేయనున్నారు. ఏపీ విభజన హామీలను తుంగలో తొక్కి.. కేవలం ఏపీకి మాత్రమే నిధులు కేటాయించి, తెలంగాణ నిధులు కేటాయించపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధికార పార్టీ ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రతిపక్షాల వరుస ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇవాళ ఢిల్లీలో ఏ క్షణానా ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More..
YS Jagan ధర్నా ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఏపీ భవన్ గేట్లు మూసివేత..!