దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్: వారి డిమాండ్లకు ఓకే
మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఆందోళనకారుల డిమాండ్లకు మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇద్దరు మహారాష్ట్ర మంత్రులు శుక్రవారం అర్థరాత్రి జరాంగేను కలిసి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను అందజేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఆందోళనకారుల డిమాండ్లకు మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇద్దరు మహారాష్ట్ర మంత్రులు శుక్రవారం అర్థరాత్రి జరాంగేను కలిసి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను అందజేశారు. దీంతో తమ నిరసనను ముగిస్తున్నట్టు మరాఠా కోటా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే ప్రకటించారు. మరాఠా రిజర్వేషన్‌ను కోరుతూ జరాంగే జనవరి 20న జల్నా నుంచి ముంబై వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ నెల 26న వేలాది మంది మరాఠా మద్దతుదారులు నవీ ముంబైలోని వాషికి చేరుకున్నారు. దీంతో జరాంగే శనివారం ఉదయం 11 గంటల వరకు షిండే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రిజర్వేషన్ల డిమాండ్‌ను అప్పటివరకు అంగీకరించకపోతే 12గంటలకు ముంబైలోని అజాద్ మైదాన్‌కు చేరుకుని నిరసన తెలుపుతానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే షిండే ప్రభుత్వం మరాఠాల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జరాంగే డిమాండ్లలో మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు, పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మరాఠాలకు సీట్ల రిజర్వేషన్ వంటివి ఉన్నాయి.
దశాబ్ద కాలంగా ఉద్యమం
మహారాష్ట్ర జనాభాలో సుమారు 33శాతం ఉన్న మరాఠా కమ్యూనిటీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దశాబ్ద కాలంగా మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం వారికి సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని మించి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే 2021లో సుప్రీంకోర్టు దానికి కొట్టివేసింది. దీంతో మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి. 2023 అక్టోబర్ 25న జల్నా జిల్లా అంతర్వాలి సారతి గ్రామంలో మనోజ్ జరాంగే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 9 రోజుల్లో ఉద్యమంతో సంబంధమున్న 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మరాఠాలకు శాశ్వత రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 2023 నవంబర్ 2న దీక్ష ముగించారు. అలాగే ప్రభుత్వానికి జనవరి 2, 2024 వరకు సమయం ఇచ్చారు. కానీ ప్రభుత్వం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకపోవడంతో మరోసారి ఆందోళన చేపట్టగా తాజాగా ప్రభుత్వం ఆమోదించడం గమనార్హం.