కర్ణాటకలో కమలం వాడిపోవడానికి కారణాలెన్నో !!

కర్ణాటకలో కమల దళం ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ పోల్స్ లో మళ్ళీ గెలవాలి.. 2018 సీన్ ను రిపీట్ చేయాలనే బీజేపీ సంకల్పం సాకారం కాలేదు.

Update: 2023-05-13 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కమల దళం ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ పోల్స్ లో మళ్ళీ గెలవాలి.. 2018 సీన్ ను రిపీట్ చేయాలనే బీజేపీ సంకల్పం సాకారం కాలేదు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చి బహిరంగ సభలు, రోడ్ షోలతో శ్రమించినా ఫలితం దక్కలేదు.. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే కర్ణాటకలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ నేతలు చెప్పిన మాటలు ఓట్లను రాల్చలేకపోయాయి. జై బజ్ రంగ్ బలి నినాదాలు ఓ వర్గం ఓటర్ల మనసును గెలువలేకపోయాయి. కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా చేసిన విమర్శలు ప్రజలను మెప్పించలేకపోయాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలున్న కీలక తరుణంలో జరిగిన ఈ అసెంబ్లీ పోల్స్ లో బీజేపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఆ ముగ్గురిని పట్టించుకోలేదు

బీఎస్ యడ్యూరప్ప.. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేసిన కీలక నేత. రాజకీయ వ్యూహ రచనలో ఉద్దండుడు. ఈ ఎన్నికల్లో ఆయనను బీజేపీ వాడుకున్న దాఖాలాలు తక్కువే. ఈ తరుణంలో యడ్యూరప్పకు ఆప్తులుగా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావడి అకస్మాత్తుగా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఈ ముగ్గురు నాయకులు రాష్ట్రంలో అత్యధిక జన సంఖ్యలో ఉన్న లింగాయత్ వర్గానికి చెందినవారు. వీరు నిష్క్రమించి కాంగ్రెస్ లో చేరడంతో లింగాయత్ వర్గం ప్రజల చూపు కూడా హస్తం పార్టీ వైపు మళ్లింది.

బొమ్మై ప్రభుత్వంపై 40శాతం కమీషన్‌ ఆరోపణలు

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను తగ్గించాయి. పబ్లిక్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టు పనుల్లో 40శాతం కమిషన్‌ తీసుకుంటున్నారంటూ రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌ లేఖను విడుదల చేయడం బొమ్మై ఇమేజ్ ను దెబ్బతీసింది. ఆయన్ను ఫ్యూచర్ లీడర్ గా రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోయారు. 2021లోనూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌ కర్ణాటకలో ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోడీకి లేఖ రాసింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సరిగ్గా ఎన్నికలకు ముందు కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌ మరోసారి విమర్శలు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కమీషన్ అవినీతిపై చేపట్టిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు కూడా పార్టీని బాగా దెబ్బతీసింది.

రిజర్వేషన్ల దెబ్బ

సరిగ్గా ఎన్నికలకు ముందు బొమ్మై సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదపడం కొంప ముంచింది. ముస్లింలకు ఉన్న 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లను తొలగించి.. వారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కేటాయించిన 10శాతం కేటగిరిలో చేర్చారు. ముస్లింలకు తొలగించిన 4 శాతం రిజర్వేషన్ కోటాను లింగాయత్‌, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున కేటాయించారు. ఇప్పటికే ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లను అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, జైనులు వంటి వారు అనుభవిస్తున్నారు. బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న ఈ వర్గాల ప్రజలు .. తమ రిజర్వేషన్లలోకి మరో వర్గాన్ని చేర్చడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక రిజర్వేషన్లలో మార్పుల కారణంగా నష్టపోతామని ఎస్సీల్లో పెద్ద వర్గమైన బంజారాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం కూడా చేటు చేసింది. ఇలాంటి అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్లాయి.

హిందుత్వ కార్డు ఫెయిల్

కర్ణాటకలోని బీజేపీ నాయకులు గత ఏడాది పొడవునా హలాల్ , హిజాబ్, అజాన్ వంటి మతపర అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపారు. ఫలితంగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అభివృద్ధి పనుల కంటే మతపరమైన అంశాలపైనే బీజేపీ నాయకులు ఎక్కువగా స్పందిస్తున్నారనే అభిప్రాయానికి ఓటర్లు రావడం బీజేపీకి మైనస్ అయింది. ఇతర రాష్ట్రాల్లో బాగా పనిచేసిన బీజేపీ హిందుత్వ కార్డు.. కర్ణాటకలో మాత్రం పని చేయలేదు. బొమ్మై సర్కారు టార్గెట్ గా కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలు జనంలోకి బాగా వెళ్లాయి. ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని యడియూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు ప్రచారం సందర్భంగా తెగేసి చెప్పడం కూడా చేటు చేసింది. కర్ణాటకలో ముస్లిం ఓటర్లు 13శాతం మంది ఉన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల వేట.. కాంగ్రెస్ పై సానుభూతి

2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో యడ్డీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది రోజుల వ్యవధిలోనే కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 జులైలో 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో నాటి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభానికి బీజేపీనే కారణమనే విమర్శలు తలెత్తాయి. ఆ తర్వాత యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టింది. కర్ణాటక ఓటర్లు ఈ పరిణామాలను ఆమోదించలేదు. దీంతో ఆనాడు కాంగ్రెస్ పై ఏర్పడిన సానుభూతి.. ఈనాడు ఫలితాల రూపంలో బయటికి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

కర్ణాటక ఎన్నికల్లో 13 మంది మంత్రులు ఓటమి!  

కాంగ్రెస్ కు ప్రధాని మోడీ కంగ్రాట్స్  

Tags:    

Similar News