హనుమంతుడి విగ్రహాన్ని మింగేసిన చిన్నారి.. తర్వాత ఏం జరిగిందంటే?
చిన్న పిల్లలు కనిపించిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుంటుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లలు కనిపించిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుంటుంటారు. అయితే మహారాష్ట్రలో ఓ చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేయడం కలకలం రేపింది. మహారాష్ట్ర హింగోలి జిల్లాకు చెందిన నాలుగేళ్ల పాప తన మెడలో కట్టిన 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని పొరపాటున మింగేసింది. దీంతో ఆ విగ్రహం చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. అయితే ఆ పాప గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని డాక్టర్లు తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం చిన్నారి అనుకోకుండా విగ్రహాన్ని మింగేసింది. విగ్రహం గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది. విషయం చిన్నారి తల్లిదండ్రులు చెప్పగా వారు హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దాదాపు 6 గంటలకు పైగా విగ్రహం పాప గొంతులోనే ఉంది. గెలాక్సీ హాస్పిటల్ వైద్యుడు నితిన్ జోషి విషయం తెలుసుకుని చిన్నారి గొంతు నుంచి హనుమంతుడి విగ్రహాన్ని తొలగించారు. చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యుడు సూచించారు.