Land For Jobs Scam: సీబీఐ చార్జిషీట్‌లో తేజస్వి, లాలూ, రబ్రీ పేర్లు..

రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2023-07-03 14:34 GMT

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ‘ఉద్యోగాలకు భూమి’ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఆర్జేడీ నాయకులైన బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీల పేర్లను చేర్చింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్న తేజస్వి, లాలూ గత నెల 23వ తేదీన పాట్నాలో 16 ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. 2004-09 మధ్య కాలంలో లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌కు చెందిన చాలా మందికి ఉద్యోగాలు లభించాయి.

ఆ ఉద్యోగాలు పొందిన వారు లాలూ కుటుంబానికి భూములను ఉచితంగా లేదా తక్కువ ధరకు విక్రయించారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లాలూ, రబ్రీదేవీలను సీబీఐ మార్చి నెలలో ప్రశ్నించింది. సీబీఐ గతేడాది దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో లాలూ దంపతులతో పాటు వారి కుమార్తె మిసా భారతి పేరు కూడా ఉంది. ఈ కేసులో ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌తో పాటు పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది.


Similar News