Jaishankar: వివాదాలను సమర్ధవంతంగా పరిష్కరించాలి.. బ్రిక్స్ సదస్సులో జైశంకర్

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వివాదాలు, ఉద్రిక్తతలను సమర్ధవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని జైశంకర్ నొక్కి చెప్పారు.

Update: 2024-10-24 10:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నెలకొన్న వివాదాలు, ఉద్రిక్తతలను సమర్ధవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నొక్కి చెప్పారు. చర్చలు, దౌత్యం ద్వారా వీటికి ముగింపు పలకాలని తెలిపారు. రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్16వ సదస్సులో భాగంగా జైశంకర్ గురువారం ప్రసంగించారు. దేశాల మధ్య ఒకసారి ఒప్పందం కుదిరితే వాటిని ఖచ్చితంగా గౌరవించాలని, అంతర్జాతీయ చట్టాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు. మధ్యప్రాచ్యం-పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇవి మరింత విస్తరించకుండా నియంత్రించాలని తెలిపారు. ఈ ఘర్షణ వల్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడిందని, ఉద్రిక్తతలు పెరిగితే పరిణామాలు ప్రమాదంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

జీ 20 ప్రెసిడెన్సీ సమయంలో భారత్ ఓ ప్రయత్నాన్ని ప్రారంభించిందని, బ్రెజిల్ దానిని ముందుకు తీసుకెళ్లినందుకు ఎంతో సంతోషిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి వనరులు, ఆధునిక సాంకేతికత సామర్థ్యాలను అందుకోవడంలో ప్రపంచీకరణ ప్రయోజనాలు చాలా అసమానంగా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. మరింత సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. స్థాపించబడిన సంస్థలు, యంత్రాంగాలను సంస్కరించడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యం, ఆహారం, ఇంధన భద్రతకు సంబంధించి దక్షిణాదిలో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ప్రపంచంలోని దీర్ఘకాలిక సమస్యలు మరింత క్లిష్టంగా మారాయని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.


Similar News