Akhilesh Yadav: రాజ్యాంగాన్ని రక్షించేందుకే కాంగ్రెస్, ఎస్పీ పోరు.. అఖిలేష్ యాదవ్

రాజ్యాంగాన్ని రక్షించేందుకే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Update: 2024-10-24 12:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని రక్షించేందుకే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లు నిరంతరం పోరాటం చేస్తున్నాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాజ్యాంగం, రిజర్వేషన్లు, సామాజిక సామరస్యం కాపాడాలని ఎస్పీ, కాంగ్రెస్ నిర్ణయించుకున్నాయి. మేము బాపు, బాబాసాహెబ్ అంబేడ్కర్, లోహియాలు కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో భారీ విజయం కోసం రెండు పార్టీలు ఐక్యమైనట్టు వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమతో కలిసి రావడంతో ఎస్పీ మరింత బలపడిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయబోదని, తొమ్మిది స్థానాల్లో ఎస్పీ బరిలోకి దిగుతుందని ప్రకటించిన నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, నవంబర్ 13న రాష్ట్రంలోని 9 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేస్తాయని భావించినా అనూహ్యంగా కేవలం ఎస్పీ మాత్రమే అన్ని స్థానాల్లో బరిలోకి దిగనుండటం గమనార్హం.


Similar News