బెంగుళూరులో కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్ళిన వాహనదారులు
మనదేశంలో అత్యధిక ట్రాఫిక్ జాం అయ్యే నగరాల్లో అగ్రస్థానంలో ఉండేది కర్ణాటక రాజధాని బెంగుళూరు(Bengaluru).
దిశ, వెబ్ డెస్క్ : మనదేశంలో అత్యధిక ట్రాఫిక్ జాం అయ్యే నగరాల్లో అగ్రస్థానంలో ఉండేది కర్ణాటక రాజధాని బెంగుళూరు(Bengaluru). కొద్దిపాటి దూరానికి కూడా గంటలు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తుంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నగరం మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ తో స్తంభించిపోతుంటుంది. తాజాగా నగరంలో మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. బుధవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్(Electronic City flyover)పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 2 కిమీల దూరానికి దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయారు. దీంతో విసుగుచెందిన వాహనదారులు తమ వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లారు. దీనిని వీడియో తీసిన ఓ నెటిజన్ నెట్లో పోస్ట్ చేయగా.. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.