తండ్రి కోసం లివర్ దానం చేసిన 17 ఏళ్ల బాలిక

లివర్ సమస్యతో తండ్రి బాధపడుతోంటే చూసి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది.

Update: 2023-02-19 09:17 GMT

దిశ, వెబ్ డెస్క్: లివర్ సమస్యతో తండ్రి బాధపడుతోంటే చూసి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. డాక్టర్లను సంప్రదిస్తే లివర్ మార్పిడి చేయాలన్నారు. దీంతో ఆ అమ్మాయి తన తండ్రికి లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ మైనర్లు అవయవదానం చేయొద్దని చట్టాల్లో ఉండటంతో ఆమె ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. కానీ ఎన్నో వ్యయ ప్రయాసాలు భరించి తన తండ్రికి పునర్జన్మనిచ్చింది ఆ బాలిక. ఈ విధంగా అవయవదానం చేసిన పిన్న వయస్కురాలిగా ఈ బాలిక రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిశూరు ప్రాంతానికి చెందిన ప్రతీశ్ (48) స్థానికంగా కేఫ్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయన కొంతకాలంగా క్రోనిక్ లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు.

ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ వ్యాధి ఎంతకూ తగ్గకపోవడంతో చివరికి ఆలువాలోని రాజగిరి ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు.. లివర్ డ్యామేజ్ అయిందని, లివర్ మార్పిడి చేయకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. ఈ వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కానీ ఎలాగోలా లివర్ మార్పిడి చేయించుకునేందుకు దాతల కోసం ప్రయత్నించారు. కానీ ఏ ఒక్క దాత ముందుకు రాలేదు. దీంతో ప్రతీశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. ఈ క్రమంలో తన లివర్ లో కొంత భాగాన్ని ఇవ్వడానికి ఆయన 17 ఏళ్ల కూతురు దేవానంద ముందుకు వచ్చింది.

కానీ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. డాక్టర్లను సంప్రదిస్తే లివర్ లో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల వ్యక్తుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, కానీ చట్టం ప్రకారం మైనర్లకు అవయవ దానం చేసే హక్కు లేదని తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బాలిక.. బంధువుల సహకారంతో కేరళ హైకోర్టును ఆశ్రయించి తన తండ్రికి లివర్ దానం చేయడానికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. తండ్రి ప్రాణాల కోసం ఆమె పడుతున్న తపనను అర్థం చేసుకున్న కోర్టు.. దేవానందకు ఆర్గాన్ దానం చేసే అవకాశాన్ని కల్పించింది.

డాక్టర్ల సలహాలతో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్న దేవానంద.. ఫిట్ గా ఉండటానికి కొన్ని రోజుల పాటు జిమ్ కు కూడా వెళ్లింది. ఈ నెల 9న ఆలువాలోని రాజగిరి హాస్పిటల్ లో లివర్ దానం చేసి తన తండ్రిని బతికించుకుంది. తండ్రి కోసం దేవానంద పడ్డ శ్రమను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లివర్ దానం చేసి తన కన్న తండ్రికి దేవానంద పునర్జన్మ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పొగడుతున్నారు.

Tags:    

Similar News