Pakistan : పాకిస్తాన్ ‘మిస్సైల్’ మిషన్‌కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
దిశ, నేషనల్ బ్యూరో : లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల (Long Range Missiles) అభివృద్ధిలో నిమగ్నమైన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది.
దిశ, నేషనల్ బ్యూరో : లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల (Long Range Missiles) అభివృద్ధిలో నిమగ్నమైన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిస్సైళ్ల తయారీలో పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖకు సహకరిస్తున్న నాలుగు పాకిస్తానీ కంపెనీలపై ఆంక్షలను (US Sanctions) విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ ప్రకటించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కోనున్న పాక్ కంపెనీల జాబితాలో అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజెస్, నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (ఎన్‌డీసీ) ఉన్నాయన్నారు. నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ అనేది పాక్ ప్రభుత్వ రంగ సంస్థ అని తెలిపారు.
‘‘అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. క్షిపణుల ప్రయోగానికి వినియోగించే వాహనాల ఛాసిస్‌లు, ఇతరత్రా పరికరాలను ఆ మూడు కంపెనీల నుంచి ఎన్‌డీసీ కొనుగోలు చేస్తోంది’’ అని మాథ్యూమిల్లర్ వివరించారు. పాకిస్తాన్‌కు చెందిన షాహిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల తయారీలో ఎన్‌డీసీ సంస్థే కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సామూహిక జనహనన ఆయుధాలను ఎన్‌డీసీ వ్యాప్తి చేస్తోందన్నారు. ఎన్‌డీసీ కంపెనీలో తయారయ్యే మిస్సైళ్లకు సంబంధించిన కొన్ని పరికరాలను అక్తర్ అండ్ సన్స్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయని ఆయన తెలిపారు. అమెరికా ఆంక్షలపై పాక్ తీవ్రంగా స్పందించింది. ‘‘అమెరికా నిర్ణయం దురదృష్టకరం. ఇది పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుంది’’ అని పాకిస్తాన్ తెలిపింది.