Fake Doctor: యూట్యూబ్ లో చూసి ఆపరేషన్.. బాలుడి ప్రాణాలు బలిగొన్న ఫేక్ డాక్టర్.. అసలేం జరిగిందంటే?

యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేసిన ఓ ఫేక్ డాక్టర్ బాలుడి ప్రాణాలు తీశాడు.

Update: 2024-09-08 07:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక మంది అర్హత లేకున్నా వైద్య సలహాలు ఇస్తుండటం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేయగా బాలుడు మృతి చెందాడు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. సారణ్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉండే గణపతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు అజిత్ కుమార్ పురి చికిత్స అందించడంతో బాలుడికి వాంతులు తగ్గిపోయాయి. వాంతులు తగ్గినప్పటికీ బాలుడికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. ఈ క్రమంలో బాలుడి తండ్రిని మరో పని మీద బయటకు పంపించిన డాక్టర్.. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే యూట్యూబ్ లో చూస్తూ ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో నొప్పికి తాళలేక బాలుడు కేకలు వేశాడు. ఆపరేషన్ చేస్తుంటే బాలుడు ఎందుకంతలా విలవిలలాడుతున్నాడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అందుకు డాక్టర్ ను నేనా మీరా అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో యువకుడి పరిస్థితి విషమించడంతో సదరు డాక్టర్ హుటాహుటిన అంబులెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశాడు. అయితే మార్గమధ్యలోనే బాలుడు మరణించడంతో అంబులెన్స్ ను వెక్కి తిప్పి ఆసుపత్రి మెట్ల మృతదేహాన్ని వదిలేశారు. అక్కడి నుంచి సదరు డాక్టర్ పరారయ్యాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ కుమారుడిని అన్యాయంగా చంపేశాడని ఆసుపత్రి ముందు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామమని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


Similar News