Haryana election results: హర్యానాలో ఆప్ కి ఘోర పరాజయం.. కేజ్రీవాల్ పై స్వాతి మలివాల్ ఫైర్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పోటీ చేసిన ఒక్కస్థానంలో కూడా ఆధిక్యంలో లేదు.

Update: 2024-10-08 08:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పోటీ చేసిన ఒక్కస్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. కాగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్పందించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు. “కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే కేజ్రీవాల్ హర్యానాకు వచ్చారు. ఆయన నన్ను బీజేపీ ఏజెంట్ అని తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే ఇండియా కూటమికి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నారు. అవన్నీ పక్కన పెట్టండి.. వినేష్ ఫొగాట్‌ను కూడా ఓడించడానికి కూడా ఆప్ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపారు. సొంత రాష్ట్రంలోనూ డిపాజిట్లను దక్కించుకోలేని పరిస్థితికి ఆప్ ఎందుకు చేరుకుంది? ఇంకా సమయం ఉంది. మీ అహాన్ని విడిచిపెట్టండి. కళ్ల నుంచి ముసుగును తొలగించండి. డ్రామాలు చేయడం మానేసి ప్రజల కోసం పని చేయండి”అని స్వాతి మలివాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

హర్యానా ఎన్నికల ఫలితాలు

హర్యానాలోని 90 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వరుసగా మూడోసారి కాషాయపార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇకపోతే, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఐఎన్‌ఎల్‌డీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. ఇకపోతే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో పొత్తు గురించి ఆప్ చర్చలు జరిపింది. అది కాస్తా విఫలంకావడంతో ఆప్ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆప్ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో జోస్యం చెప్పారు. కానీ, పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.


Similar News