'కేంద్రం ఆర్డినెన్స్‌ను అడ్డుకోలేం'.. సుప్రీంకోర్టు

ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ అమలుకాకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-07-10 12:21 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ అమలుకాకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతోపాటు మధ్యంతర స్టే విధించాలని కోరుతూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈవిషయాన్ని వెల్లడించింది. అయితే ఆర్డినెన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. "ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సూపర్ సీఎంలా వ్యవహరిస్తున్నారు" అని పిటిషన్‌లో ప్రస్తావించినందున.. ఆయనను కూడా ప్రతివాదిగా చేర్చి పిటిషన్‌ను సవరించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.

దీనిపై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (జులై 17) వాయిదా వేసింది. 400 మంది ఉద్యోగులు, నిపుణులను లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించిన వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే వారం కోర్టు విచారించనుంది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ మే 19న కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కానీ ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది. దీన్ని కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆరోపిస్తోంది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్‌ దూరం చేస్తుందని తన పిటిషన్‌లో ఆప్ సర్కారు పేర్కొంది.


Similar News