న్యూఢిల్లీ: విడాకుల మంజూరు అంశంపై ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కలిసి బతకలేని స్థితిలో భార్యాభర్తలకు వెంటనే విడాకులు ఇవ్వొచ్చని.. పరస్పర అంగీకారంతో వారు విడిపోవాలని భావిస్తే , 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈమేరకు తమకు విశిష్ట అధికారాలు ఉన్నాయని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గుర్తు చేసింది. ఈ 6 నెలల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను కొన్ని షరతులతో సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకుల కోసం 6 నెలలు తప్పనిసరిగా ఎదురుచూడాలని హిందూ వివాహ చట్టం సెక్షన్ 13బి చెబుతోంది. కానీ ఈ రూల్ ను ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది.
భార్యాభర్తల వివాహ జీవితం మళ్ళీ కలపలేని విధంగా దెబ్బతింటే.. ఆర్టికల్ 142 కింద విశిష్ట అధికారాలను ఉపయోగించుకొని వారికి వెంటనే విడాకులను మంజూరు చేయవచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. " ప్రాథమిక హక్కుల దృష్ట్యా ఆర్టికల్ 142ని పరిగణనలోకి తీసుకోవాలి.. దీని ప్రకారం రాజ్యాంగ పరిధిని దాటి పూర్తి న్యాయం చేసే అధికారాన్ని న్యాయస్థానం కలిగి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది.
తిరిగి కలపలేని విధంగా భార్యాభర్తల వైవాహిక జీవితం దెబ్బతిని ఉంటే.. విడాకుల కోసం సుదీర్ఘ న్యాయ విచారణకు కుటుంబ న్యాయస్థానాలకు పంపకుండా రద్దు చేయవచ్చని బెంచ్ తెలిపింది. ఇటువంటి తరుణంలో భరణం చెల్లింపు, మెయింటెనెన్స్, పిల్లల హక్కులకు సంబంధించిన ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలనేది తీర్పులో వివరించింది. దీంతో ఫాస్ట్ ట్రాక్ లో విడాకుల మంజూరుకు సర్వోన్నత న్యాయస్థానం తెర తీసింది.
ఏడేళ్ల క్రితం..
ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏడేళ్ల క్రితం.. 2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకుల కోసం 6 నెలల తప్పనిసరి వెయిటింగ్ పీరియడ్ ను ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు రద్దు చేయగలదా..? అనే అంశంపై అప్పట్లో విచారణ నిర్వహించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2022 సెప్టెంబర్ 29న తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం ఈ వ్యవహారంలో న్యాయస్థానానికి సహకరించేందుకు సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, వీ గిరి, కపిల్ సిబల్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరాలను అమికస్ క్యూరీలుగా నియమించారు. తాజాగా సోమవారం దానికి సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు బెంచ్ వెలువరించింది.