న్యూఢిలీ: అంతర్గత యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌లో ఒక్క భారతీయుడిని కూడా వదిలిపెట్టమని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని అంగీకరిస్తూనే ఈ ప్రకటన చేశారు. ఏప్రిల్ 15న సూడాన్‌లో వివాదం మొదలైనప్పటి నుంచి కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. చిక్కుకుపోయిన భారతీయులకు సమాచారం అందించేందుకు 24/7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
‘భారతీయులను వివిధ ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారిని స్వదేశానికి చేర్చడమే మా లక్ష్యం’ అని క్వాత్రా చెప్పారు. సూడాన్‌లో 3,500 మంది భారతీయులు, 1000 మంది పీఐఓలు (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) ఉన్నట్టు అంచనా వేశామని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు మూడవ నౌక ఐఎన్ఎస్ తార్కాష్ కూడా పోస్ట్ సూడాన్‌కు చేరుకుంది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ కావేరీ గురించి ఆయన మాట్లాడుతూ.. 367 మంది భారతీయులు జెడ్డా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నారని చెప్పారు. పోర్ట్ సూడాన్ నుంచి భారతీయులను జెడ్డాకు తరలించారు. తరలింపు ప్రక్రియలో సహకరించిన సౌదీ అరేబియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సోమవారం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.