Stalin slams Nirmala Sitharaman: హోటల్ యజమానితో క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రెస్టారెంట్ ఓనర్ నిర్మలా సీతారామన్‎కు క్షమాపణలు చెప్పారు

Update: 2024-09-14 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో ఇటీవల సోషల్మీడియా వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన తమిళనాడు రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్.. నిర్మలా సీతారామన్‎కు క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ వీడియోను వైరల్ అవడంతో స్టాలిన్ కేంద్రమంత్రిపై విరుచుకుపడ్డారు. శనివారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్.. నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు. జీఎస్టీ గురించి మాట్లాడిన వ్యక్తికి ఏమి జరిగిందో చూస్తే చాలా నిరుత్సాహంగా ఉందన్నారు. కేంద్రమంత్రి హోటల్ యజమానితో క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటని స్టాలిన్ అన్నారు.

అసలేం జరిగిందంటే?

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమైన రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ ఆహారపదార్థాలపై మారుతున్న జీఎస్టీ వల్ల రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ధ్వజమెత్తారు. క్రీమ్‌తో నిండిన బన్స్‌పై 18 శాతం పన్ను విధించబడుతుందని, అయితే బన్స్‌పై జీఎస్టీ లేదని శ్రీనివాసన్ హైలైట్ చేశారు. ఆ తర్వాత, కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే వనతీ శ్రీనివసన్ సమక్షంలో రెస్టారెంట్ ఓనర్ కేంద్రమంత్రికి క్షమాపణలు చెప్పారు. "నా వ్యాఖ్యలకు దయచేసి నన్ను క్షమించండి. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు" అని ఆయన అన్నారు. ఆ వీడియోను బీజేపీ తమిళనాడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సీతారామన్‌ను విమర్శించారు. అహం అవమానాన్ని మాత్రమే అందిస్తుందని నిందిచారు.


Similar News