Chidambaram: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అత్యవసరం.. కాంగ్రెస్ నేత చిదంబరం
జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించడం అత్యవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నొక్కి చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించడం అత్యవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నొక్కి చెప్పారు. ప్రజలు తమను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని కానీ ప్రజల భద్రతపై చర్యలు తీసుకునేందుకు సీఎంకు ఆ అధికారం లేకపోవడం సరికాదని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘శాంతి భద్రతల పరిరక్షణకు కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. కానీ ఆ సమావేశానికి ప్రజలు ఎన్నుకున్న సీఎం హాజరుకాలేదు. ఆయనను ఆహ్వానించారో లేదో కూడా తెలియదు. జమ్మూ కశ్మీర్‌లో అధికాకారాలు ఎల్జీ వద్ద రిజర్వ్ చేయబడ్డాయి. కాబట్టి రాష్ట్ర హోదా వెంటనే పునరుద్ధరించాలి’ అని పేర్కొన్నారు. ఇటీవల గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలోని సొరంగం వద్ద భవన నిర్మాణ కార్మికులపై ఉగ్రదాడి జరిగింది. దీంతో ఎల్జీ మనోజ్ సిన్హా భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చిదంబరం వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.