కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు, ఇద్దర్ పోర్టర్లు మృతి

జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుల్మార్గ్ జిల్లాలోని బోటాపాతర్ ఏరియాలో ఆర్మీ వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కనీసం ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

Update: 2024-10-24 16:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో బూటాపాత్రి ఏరియాలో ఆర్మీ వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు(పోర్టర్లు) మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడగా వారిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఎల్‌వోసీకి సమీపంలో గుల్మార్గ్ దగ్గర బూటాపత్రి సమీపంలోని నాగిన్ పోస్ట్ వద్ద ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. ఎల్‌వోసీ వద్ద చొరబాటు ప్రయత్నం జరుగుతుండగా ఈ కాల్పులు జరిగాయా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. బారాముల్లా బూటాపత్రిలో భారత ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య ఫైరింగ్ జరినట్టు వివరించారు. గందార్బల్ జిల్లాలో గురువారం ఉదయమే కార్మికుడిపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌గా ఆ బాధితుడిని అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే గందార్బల్‌లో టన్నల్ పని చేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులను, ఓ వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపేసిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల్లో కొందరు గాయపడగా.. మరికొందరు మరణించినట్టు ఒమర్ వివరించారు. ఇటీవల జరుగుతున్న కాల్పులు తీవ్ర ఆందోళనను కల్పిస్తున్నాయని తెలిపారు. మృతులకు సంతాపం తెలిపిన తర్వాత బంధువులకు సానుభూతిని ప్రకటించారు.

Tags:    

Similar News