Hemant Soren: జార్ఖండ్ వ్యతిరేక శక్తులకు తలవంచబోను.. సీఎం హేమంత్ సోరెన్

జార్ఖండ్ ఎన్నికల్లో బర్హెట్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-10-24 15:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్హెట్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బర్హెట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జార్ఖండ్ వ్యతిరేక శక్తులు, కుట్రదారులకు తాను ఎన్నటికీ తలవంచబోనని తేల్చి చెప్పారు. అమరవీరులు కలలు గన్న జార్ఖండ్‌ను నిర్మించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తెలిపారు. అసోం సీఎం హిమంత బిస్వ శర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిస్వశర్మను ప్రవాసీ సీఎంగా అభివర్ణించిన హేమంత్.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన రాష్ట్రంలో కనిపించబోరని తెలిపారు. కేవలం ఆయనే గాక పెద్ద పెద్ద నాయకులు సైతం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉన్నారని ఎలక్షన్స్ తర్వాత వారంతా కనుమరుగవుతారని విమర్శించారు. మరోవైపు, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సైతం గండే అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. కాగా, 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో వచ్చే నెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి దశ ఎన్నికల నామినేషన్ కు గురువారం చివరి రోజు కావడం గమనార్హం.


Similar News