Canada: కెనడాలోని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన భారత రాయబారి సంజయ్ వర్మ
భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ మాట్లాడాలని,వారి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు
దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ గురువారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తాము నివశించే ప్రాంతం గురించి తెలుసుకోవాలని, ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదులు వారిని రాడికలైజ్ చేసే ప్రయత్నాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ మాట్లాడాలని, వారి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. ప్రస్తుతం కెనడాలోని భారతీయులకు ఖలిస్తాని ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, ఇది విద్యార్థులకు కూడా చేరవచ్చని వర్మ అన్నారు. కెనడా ఆర్థికవ్యవస్థ నెమ్మదించిన కారణంగా ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి. దీన్ని అవకాశంగా మార్చుకుని ఖలిస్తాని ఉగ్రవాదులు డబ్బు, ఆహారం ఆఫర్ చేస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయాల వెలుపల భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసేందుకు, భారత జెండాను అవమానిస్తూ ఫోటోలు, వీడియోలు తీసేందుకు కొంతమంది విద్యార్థులను ఒప్పించినట్టు కూడా తెలుస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్న వారిని తిరిగి భారత్‌కు వెళ్తే శిక్ష పడుతుందని భయపెడుతున్నారు. ఈ పరిణామాలు విద్యార్థులకు సవాలుగా మారాయని, వారంతా తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సంజయ్ వర్మ హెచ్చరించారు.