'అది కొట్లాటలో తగిలిన గాయం లాంటిదే'.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గొడవ జరుగుతుండగా.. మరొకరి వృషణాలను నొక్కడాన్ని హత్యాయత్నంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-06-26 10:50 GMT

బెంగళూరు: గొడవ జరుగుతుండగా.. మరొకరి వృషణాలను నొక్కడాన్ని హత్యాయత్నంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఘర్షణ జరిగే క్రమంలో వృషణాలను నొక్కి ఒకరికి తీవ్రమైన బాధను కలిగించినందుకుగానూ.. పరమేశ్వరప్ప అనే వ్యక్తిని(38) దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో హైకోర్టు విభేదించింది. వృషణాలను నొక్కిన వ్యక్తికి విధించిన జైలు శిక్షను ఏడేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. వివరాల్లోకి వెళితే.. 2010 సంవత్సరంలో చిక్కమగళూరు జిల్లా కడూరులోని మొగలికట్టే ఏరియాకు చెందిన ఓంకారప్ప గ్రామ జాతర ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుండగా.. పరమేశ్వరప్ప వచ్చి ఘర్షణకు దిగాడు. ఇద్దరూ కొట్టుకుంటుండగా.. ఓంకారప్ప వృషణాలను పరమేశ్వరప్ప పిసికాడు. ఈమేరకు పోలీసులకు ఓంకారప్ప ఫిర్యాదు చేశాడు.

దీన్ని విచారించిన చిక్కమగళూరులోని ట్రయల్ కోర్టు దాన్ని హత్యాయత్నంగా పరిగణించి.. పరమేశ్వరప్పకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే తనకు హత్య చేసే ఉద్దేశం లేదంటూ నిందితుడు కర్ణాటక హైకోర్టులో 2012 సంవత్సరంలో అప్పీల్ చేసుకున్నాడు. దాన్ని విచారించిన న్యాయ స్థానం.. “అక్కడికక్కడే నిందితుడు, ఫిర్యాదుదారు మధ్య వాగ్వాదం జరిగింది. కొట్లాట జరిగే క్రమంలో నిందితుడు పరమేశ్వరప్ప ఎదుటి వ్యక్తి వృషణాలను పిసికాడు. అంతమాత్రాన హత్య చేయడానికే అలా చేశాడని చెప్పలేం. ఒకవేళ మర్డర్ చేసే దురుద్దేశమే ఉండి ఉంటే.. నిందితుడు తనతో మారణాయుధాలను తీసుకెళ్లి ఉండేవాడు” అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. వృషణాలను పిసకడం వల్ల కలిగిన బాధను గొడవలో తగిలిన గాయంగానే పరిగణించాలని స్పష్టం చేసింది.


Similar News