PMMY: ప్రధానమంత్రి ముద్రయోజన రుణ పరిమితి పెంపు.. కానీ వారికి మాత్రమే వర్తింపు
ప్రధానమంత్రి ముద్ర యోజన రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
దిశ, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana). ఈ పథకం కింద అనేక మంది రుణాలు పొంది.. లబ్ధి పొందారు. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు రుణాలిచ్చి.. వారిని ఆర్థికంగా సపోర్ట్ చేయడమే ఈ పథకం లక్ష్యం. ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో (Budget 2024) ఈ రుణ పరిమితిని పెంచుతామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చెప్పినట్లే.. ఈ రుణ పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణపరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో మూడు రకాల రుణాలుంటాయి. శిశు రుణాల కింద రూ.50 వేలు, కిశోర రుణాల కింద రూ.50 వేలు నుంచి రూ. 5 లక్షల వరకూ, తరుణ్ రుణాల కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ పొందవచ్చు. తాజాగా పెంచిన రుణపరిమితికి తరుణ్ ప్లస్ అనే కేటగిరీని యాడ్ చేసి.. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ పెంచింది. కానీ.. ఇప్పటికే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్లు తీసుకుని తిరిగి వాటిని చెల్లించారో.. వారికి మాత్రమే ఈ రుణం తీసుకునే అర్హత ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.