వాయుకాలుష్యంపై DGHS ఆందోళన.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ

పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు వాయుకాలుష్యానికి తీవ్రంగా గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర ఆరోగ్య శాఖలు వాయు కాలుష్యం నేపథ్యంలో తమ సంసిద్ధతను పెంచాలని సూచించారు.

Update: 2024-10-25 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగి.. గాలి నాణ్యత దారుణంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ (DGHS) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ వాయుకాలుష్యం పెరిగిందని పేర్కొంటూ అతుల్ గోయల్ లేఖ రాశారు. వాయు కాలుష్యం శ్వాసకోశ, హృదయ, సెరెబ్రోవాస్కులర్ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోందని, అవి అకాల మరణాలకు దారితీస్తాయని తెలిపారు.

పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు వాయుకాలుష్యానికి తీవ్రంగా గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర ఆరోగ్య శాఖలు వాయు కాలుష్యం నేపథ్యంలో తమ సంసిద్ధతను పెంచాలని సూచించారు. వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రజలలో అవగాహన పెంచడం చాలా ముఖ్యమన్నారు.

పంట వ్యర్థాలు, చెత్తను కాల్చకుండా నివారించడం, పండుగల సమయంలో బాణాసంచా వినియోగాన్ని పరిమితం చేయడం, ప్రైవేట్ డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ప్రోత్సహించడం, డీజిల్‌తో నడిచే జనరేటర్లపై ఆధారపడటాన్ని పరిమితం చేయడం, ధూమపానాన్ని నిషేధించడం వంటి చర్యల్ని చేపట్టాలన్నారు. బయటికి వెళ్లే ముందు ప్రభుత్వ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా వాయు నాణ్యత సూచికలను పర్యవేక్షించడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటివి చేయాలన్నారు.

క్రీడలు, వ్యాయామం వంటి బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వాయు కాలుష్యం కారణంగా తలెత్తే లక్షణాలు, అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు వెంటనే వైద్య సంరక్షణను పొందాలని తెలిపారు. 

Tags:    

Similar News