‘సారీ డిస్మిస్డ్’.. సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Update: 2024-07-15 10:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఆ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని జస్సిట్ బేల ఎం త్రివేది, ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డీకే తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం "సారీ డిస్మిస్డ్" అని వ్యాఖ్యానించింది. 2013 నుంచి 2018 మధ్యకాలంలో డీకే మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని డీకే ఆశ్రయించారు. గతేడాది అక్టోబరులో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతేగాక.. మూడు నెలల్లో నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన డీకేకు ఎలాంటి ఊరట లభించలేదు.


Similar News