తమిళనాడు మంత్రి బాలాజీ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ..

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్లపై

Update: 2023-07-20 11:30 GMT

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేయడాన్ని సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సెంథిల్ బాలాజీ సవాల్ చేశారు. బాలాజీ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఈడీ.. ఏ సమయంలోనైనా బాలాజీని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని, ఈ పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలని కోరారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాల్లోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ ఓ పిటిషన్‌ను ఈడీ కూడా దాఖలు చేసిందని, దీన్ని కూడా కలిపి విచారించాలని కోరారు.

దీంతో ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. బాలాజీ అరెస్టును మద్రాస్ హైకోర్టు జూలై 14న సమర్థించింది. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయగా, మూడో న్యాయమూర్తి బాలాజీ అరెస్టును సమర్థించారు. బాలాజీ ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని 15 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ నుంచి మినహాయించాలని ఈడీ చేసిన డిమాండ్‌ సరైనదేనని హైకోర్టు తెలిపింది. కాగా, బాలాజీ 2014లో ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసినపుడు అవినీతి కుంభకోణానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయన 2018లో డీఎంకేలో చేరారు.


Similar News