రష్యాకు బయల్దేరిన మోడీ.. పుతిన్‌తో కీలక భేటీ

BRICS సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తెల్లవారుజామున రష్యాకు పయనమయ్యారు.

Update: 2024-10-22 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ఆధ్వర్యంలో ఈ రోజు (మంగళవారం), రేపు (బుధవారం) 16వ బ్రిక్స్ (Brazil, Russia, India, China, South Africa) సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తెల్లవారుజామున రష్యాకు పయనమయ్యారు. ఈ దఫా బ్రిక్స్ సదస్సు కజాన్‌ నగరంలో జరుగనుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. అలాగే ఆ సమస్యలపై సామూహికంగా సానుకూల పరిష్కారాన్ని సాధించేందుకు ఏకమవ్వడంపై చర్చ జరగనుంది.

ఇదిలా ఉంటే ఈ సమావేశం అనంతరం.. రేపు (బుధవారం) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు ఇతర బ్రిక్స్‌ నేతలతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ద్వేపాక్షిక చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆదోళనకర పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Similar News