నీతి ఆయోగ్‌లోకి శివరాజ్ సింగ్, నడ్డా..పాలక మండలిని పునరుద్ధరించిన కేంద్రం

నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. చైర్మన్, వైస్ చైర్మన్, శాశ్వత సభ్యుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ కొనసాగనున్నారు.

Update: 2024-07-16 18:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. చైర్మన్, వైస్ చైర్మన్, శాశ్వత సభ్యుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ కొనసాగనున్నారు. డాక్టర్ వీకే సరస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్ర, డాక్టర్ వీకే పాల్, అరవింద్ వీరమణిలు సైతం పూర్తికాల సభ్యులుగా కంటిన్యూ అవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఎక్స్-అఫీషియో సభ్యుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు.

11 మంది ప్రత్యేక ఆహ్వానితులు

నీతి ఆయోగ్ కొత్త బృందంలో 11 మంది మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది. వీరిలో బీజేపీ మంత్రులతో సహా మిత్రపక్షాల నేతలకూ అవకాశం లభించింది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఎంఎస్‌ఎంఈ మంత్రి జితన్‌రామ్ మాంఝీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరమ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌, ఇండిపెండెంట్ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్‌లను ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా నియమించారు.

గతంలో నీతి ఆయోగ్ ఎక్స్ అఫిషియో సభ్యుల్లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఉండగా..ఆయన స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నియమించారు. అలాగే గత పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల్లో పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవ్‌లు ఉన్నారు, అయితే ఈసారి వారిద్దరికి చోటు కల్పించలేదు. వీరి స్థానంలో మిత్రపక్షాల్లోని కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు. కాగా, ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను 2015 జనవరి 1న కేంద్ర మంత్రి వర్గ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు.

Similar News