hunger strike: దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

Update: 2024-10-09 09:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరశన దీక్ష చేపడుతున్నారు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, గురుతేజ్‌ బహదూర్ (GTB) హాస్పిటల్‌కు చెందిన వైద్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరాహార దీక్ష ప్రారంభించారు. బుధవారం ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీ ఎయిమ్స్‌(AIIMS) రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) క్యాండిల్ మార్చ్‌ను నిర్వహించననున్నట్లు పేర్కొంది. బెంగాల్‌ జూనియర్‌ వైద్యులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేస్తూ బుధవారం నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఎంఏఎంసీ కాలేజీ ఆర్డీఏ ప్రెసిడెంట్ అపర్ణ సేథియా తెలిపారు. దేశంలో జరిగే ఇటువంటి క్రూర చర్యలను చూస్తూ మౌనంగా ఉండమని జీటీబీ వైద్యుల సంఘం పేర్కొంది. పని ప్రదేశాల్లో వైద్యులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) సైతం నిరాహార దీక్షలో పాల్గొంది. వైద్యుల భద్రత, గౌరవం కోసం ముందుండి పోరాడతామని తెలిపింది.

హత్యాచార ఘటన

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టారు. డిమాండ్ల నెరవేర్చేందుకు బెంగాల ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 42 రోజులుగా సాగించిన నిరసనలను విరమించారు. సెప్టెంబర్ 21 నుంచి పాక్షికంగా విధులు నిర్వహించారు. అయితే, తమ భద్రతపై బెంగాల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అక్టోబర్ 5 సాయంత్రం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అందుకు మద్దతుగానే బుధవారం దేశవ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. వారికి మద్దతిస్తూ మంగళవారం ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు కూడా రాజీనామా చేశారు.

Similar News