Congress Haryana Loss: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై మిత్రపక్షాల విమర్శలు

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జమ్ముకశ్మీర్ లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది.

Update: 2024-10-09 10:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జమ్ముకశ్మీర్ లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో ఆరు సీట్లు గెలిచింది. ఇదిలా ఉంటే, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శన ఇండియా కూటమిలో విబేధాలకు కారణమైంది. ముఖ్యంగా మిత్రపక్షాలు కాంగ్రెస్ ని ఏకిపారేస్తున్నాయి. ఉద్థవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన సామ్నా పత్రిక ద్వారా కాంగ్రెస్‌ని విమర్శించింది. ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం సహా స్థానిక నాయకులపై పట్టు ప్రదర్శించడంలో విఫలమైందని చెప్పింది. గెలిచే పరిస్థితిని ఓటమిగా మార్చేసిందని కాంగ్రెస్ ని విమర్శించింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గం చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ మహరాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. హర్యానా, మహారాష్ట్ర వేర్వేరు రాజకీయ నేపథ్యాల్ని కలిగి ఉన్నాయని, మహారాష్ట్రలో జ్యోతీరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ భావజాలం ఉందని అన్నారు.

త్వరలోనే మహారాష్ట్ర ఎన్నికలు

ఇకపోతే, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పొత్తులో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అతివిశ్వాసం కొంపముంచిందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గతేడాది చివర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలని సామ్నాలో ప్రస్తావించింది. అతివిశ్వాసంతోనే రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిందని చెప్పుకొచ్చింది. భూపిందర్ హుడా, కుమారి సెల్జాల మధ్య ఆధిపత్య పోరుని కూడా సామ్నాలో పేర్కొంది. అంతేకాకుండా, టీఎంసీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. కాంగ్రెస్‌ది అహంకారపూరిత ధోరణి అని అభివర్ణించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ వైఖరిని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై లోతైన సమీక్ష చేసుకోవాలని సూచించింది.

Similar News