Shashi Tharoor: వారానికి 40 గంటలకు మించి పని ఉండవద్దు.. ఈవై ఉద్యోగిని మృతిపై శశి థరూర్ వ్యాఖ్యలు

యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా(Ernst and Young India) ఉద్యోగిని మృతి ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు.

Update: 2024-09-21 04:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా(Ernst and Young India) ఉద్యోగిని మృతి ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. వారానికి 40 గంటలకు మించి పని ఉండకూడదన్నారు. దీనికోసం పార్లమెంటులో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ‘యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియాలో రోజుకు 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య 4 నెలలు పనిచేసిన అన్నా సెబాస్టియన్‌ చనిపోయింది. ఆమె తండ్రితో మాట్లాడి పరామర్శించాను. అప్పుడు ఆయన చెప్పిన సూచన నాకు ఆమోదయోగ్యంగా అన్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రోజుకు ఎనిమిది గంటలు, వారానికి ఐదు రోజులకు మించి ఉద్యోగులతో పని చేయించవద్దు. అన్ని పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్‌ క్యాలెండర్‌ ఉండాలి. పనిప్రదేశాల్లో మానవహక్కులను అడ్డుకోకూడదు. అమానవీయ చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం’’ అని శశిథరూర్‌ (Shashi Tharoor) సోషల్ మీడియా ‘ఎక్స్‌’ లో చెప్పుకొచ్చారు.

ఈవై ఉద్యోగిని మృతి

ఇకపోతే, ఈవైలో పనిచేస్తున్న కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్‌ ఈ ఏడాది జులై 20న మరణించారు. పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో సహచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్నా సెబాస్టియన్ చనిపోయింది. పని ఒత్తిడి వల్లే ఆమె చనిపోయిందంటూ అన్నా తల్లి ఆరోపించారు. ఈవై హెడ్ కు ఆమె రాసిన లెటర్ వైరల్ గా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఈ అంశంపై విచారణ చేపడతామంది.


Similar News