Congress: జవాబుదారీతనం, పారదర్శకతను అపహాస్యం చేస్తోంది.. సెబీ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు

సెబీ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సెబీ చీఫ్ మాధబి పూరి బచ్, ఆమె ఫ్యామిలీ ఆస్తుల వివరాలు వెల్లడించలేమని సెబీ తెలిపింది.

Update: 2024-09-21 06:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెబీ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సెబీ చీఫ్ మాధబి పూరి బచ్, ఆమె ఫ్యామిలీ ఆస్తుల వివరాలు వెల్లడించలేమని సెబీ తెలిపింది. అయితే, సెబీ అలా చేయడం జవాబుదారీతనాన్ని పరిహారం చేయడమే అని కాంగ్రెస్ మండిపడింది. కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జి జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ ఈ విషయంపై స్పందించారు. ‘‘సెబీ చీఫ్ ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ టైంలో ఆమెకు సంబంధించిన విషయాలను వెల్లడించడానికి సెబీ నిరాకరిచింది. ఈ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉంది. ఆర్టీఐ ద్వారా సమాచారం అందించాలని కోరిన వ్యక్తి అభ్యర్థనను సెబీ తోసిపుచ్చి జవాబుదారీతనం, పారదర్శకతను అపహాస్యం చేస్తోంది’’ అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే?

మాధబి, తన కుటుంబసభ్యుల ఆస్తులు, ఈక్విటీల వివరాలను ప్రభుత్వం, సెబీ బోర్డుకు తెలిపిందా? ఉంటే ఆ వివరాలు వెల్లడించాలని కోరుతూ.. రిటైర్డ్‌ కమొడోర్‌ లోకేశ్‌ బాత్రా ఆర్టీఐ కింద సెబీకి పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమాచారం ‘వ్యక్తిగతమైనద’ని, అవి బయటకు వెల్లడిస్తే.. వ్యక్తిగత భద్రతను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని సెబీ తెలిపింది. ఈవిషయంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇకపోతే, అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో పదవీ విరమణ తర్వాత, సెబీ పదవిలో ఉంటూ కూడా ఆ బ్యాంక్‌ నుంచి ఆదాయం పొందుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాక ఆమె భర్త ధావల్‌ మహీంద్రా గ్రూప్‌ నుంచి రూ.4.78 కోట్ల ఆదాయం పొందుతున్నట్లు వాదించింది. అయితే, ఆ ఆరోపణలను మాధబి దంపతులు తిరస్కరించారు. కాగా.. సెబీ తీరుతో కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది.


Similar News