Nitin Gadkari: వారి మాటను వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష- నితిన్ గడ్కరీ
తనను వ్యతిరేకించే వర్గాల వారి మాటను వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: తనను వ్యతిరేకించే వర్గాల వారి మాటను వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాలకుల వ్యవహారతీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు. ”ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా పాలకుడు దాన్ని సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వ్యక్తం చేయడంతోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది.” అని గడ్కరీ చెప్పుకొచ్చారు. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం అనే భావనలు కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు.