CBI: ఆర్జీ కర్ ఆస్పత్రిలో మెడిసన్ కొనుగోళ్లలో భారీ లోపాలు.. వెలుగులోకి మాజీ ప్రిన్సిపల్ నేరాలు

కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది.

Update: 2024-09-21 09:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ మాజీ ప్రిన్సిపల్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్‌ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఇతర ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలించే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం, ప్రఖ్యాత వైద్య సంస్థలకు మందుల సరఫరాలో నైపుణ్యం, అనుభవం ఆధారంగా బిడ్డర్లను షార్ట్‌లిస్ట్ చేయడంలో సాంకేతిక మూల్యాంకనం తొలిదశ, కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్‌ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది.

ట్రైనీ డాక్టర్ తో వాగ్వాదం

రోగుల ఆరోగ్యం బిడ్డర్లు సరఫరా చేసే వస్తువులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సాంకేతిక మూల్యాంకన ముఖ్యమైంది. కానీ, అందులో సందీప్ ఘోష్ అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్‌ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్‌ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్‌ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. అయితే, మృతికి ముందు ఆగస్టులోనే ట్రైనీ డాక్టర్ కు, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు మధ్య మెడిసిన్ నాణ్యత గురించి వాగ్వాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కలకలం రేపింది. హత్యాచారం కేసులోనే సందీప్ ఘోష్ పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.


Similar News