ఢిల్లీకి ఆరో ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసంలో సాయంత్రం 4.30 గంటలకు ఆమె మంత్రిమండలితో కలిసి ప్రమాణం చేయించారు
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసంలో సాయంత్రం 4.30 గంటలకు ఆమె మంత్రిమండలితో కలిసి ప్రమాణం చేయించారు. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా, ఢిల్లీకి ఆరో సీఎంగా ఆతిశీ నిలిచారు. అలాగే అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మహిళగా కూడా ఆతిశీ మార్లేనా సింగ్ నిలిచారు. అంతకు ముందు ఢిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాల పాటు ఆమె ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం ఆప్ వశమైంది. బీజేపీ నుంచి 1998లో సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజుల ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. షీలాదీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిశీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఢీల్లీలో అతిశీ మినహా మరే రాష్ట్రంలోనూ మహిళా సీఎంలు లేరు. గతంలో మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), మాయావతి (యూపీ), రబ్రీ దేవి (బిహార్), జయలలిత (తమిళనాడు) తదితరులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.
ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఆతిశీ చేత ప్రమాణం చేయించారు. ఆతిశీతో పాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ అధినేత, గత సీఎం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ‘ఢిల్లీ సీఎంగా అతిపెద్ద బాధ్యతను తనపై మోపిన ‘గురువు’ కేజ్రీవాల్‌కు అతిశీ ధన్యవాదాలు తెలిపారు. కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు.
2013లో ఆప్‌లో చేరిన ఆతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఆతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపారు. సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి, తాజాగా ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.