ఎన్నికల ప్రకటనకు ముందు జమ్మూ కాశ్మీర్ లో కీలక పరిణామాలు

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Update: 2024-08-16 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ ప్రకటన చేయడానికి ఒకరోజు ముందు అనగా ఆగస్టు 15న జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన దాదాపు 200 మంది అధికారుల్లో 88 మంది ఐఏఎస్ అధికారులు, 33 మంది ఐపీఎస్ అధికారులు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఒక్కసారిగా, అది కూడా స్వాతంత్ర్య దినోత్సవవేళ ఇంతమంది అధికారులను బదిలీ చేయడం వెనక అర్థం ఏమిటని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ బదిలీల వెనుక జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నారని ఒమర్ మండిపడ్డారు. ఈ బదిలీలపై సమీక్ష జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని బృందం ఆ రాష్ట్రంలో పర్యటించిన కొన్ని గంటల అనంతరమే ఎన్నికల నిర్వహణపై ప్రకటన వెలువడింది.    


Similar News